
రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలే అంధకారంలో..!
పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం ముందు వీధి దీపాలు బంద్ – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 01 2026: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలే అంధకారంలో మగ్గడం ఏన్కూరు మండల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వీధి దీపాలు చాలా రోజులుగా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతమంతా పూర్తిగా చీకటిలో మునిగిపోతోంది.
పగలు ప్రజలతో కిటకిటలాడే ఈ కార్యాలయాల వద్ద రాత్రి వేళల్లో పరిస్థితి భయానకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వెలుతురు లేకపోవడం, పరిపాలన నిర్వహించే ఎమ్మార్వో కార్యాలయం ముందు కూడా ఇదే పరిస్థితి ఉండడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాల భద్రతకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వీధి దీపాలు చెడిపోయి రోజులైనా సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య అందరికీ కనిపిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు లేకపోవడం దురదృష్టకరమని విమర్శిస్తున్నారు.
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తుగా వీధి దీపాలను పునరుద్ధరించి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో భద్రతను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




