
నాంపల్లి కోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి చెలరేగిన మంటలు
హైదరాబాద్ మహానగరంలో ఇటీవలి కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అర్థరాత్రి దాటాక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ప్రధాన భవనంలోని మూడో ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉన్నట్లుండి మంటలు ఎగసిపడటంతో ఆ పరిసరాల్లో కలకలం రేపింది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో నాంపల్లి కోర్టు మూడో అంతస్తులోని ఒక గది నుంచి దట్టమైన పొగలు, మంటలు బయటకు రావడాన్ని అక్కడే భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే వారు పైర్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వెంటనే రెండు ఫైరింజన్లతో వారు స్పాట్‌కు చేరుకుని చేరుకున్నారు.
మంటలు పక్కన ఉన్న ఇతర గదులకు, కోర్టు రికార్డు రూమ్‌లకు వ్యాపించకుండా సిబ్బంది సకాలంలో స్పందించి, తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయం కావడంతో కోర్టులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోర్టుకు సంబంధించిన ఏవైనా కీలకమైన పత్రాలు, ఫైళ్లు ఏమైనా కాలిబూడదయ్యాయ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.




