
గృహ వినియోగ గ్యాస్‌తో కమర్షియల్ దందా?..
గృహ గ్యాస్ దుర్వినియోగం.. తనిఖీలు లేక యథేచ్ఛగా వినియోగం
నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు
కమర్షియల్ గ్యాస్‌కు బదులుగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు..అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 07 2026: ప్రభుత్వం గృహ అవసరాల కోసం సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఇంటి వంట అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా, కొందరు వాటిని కమర్షియల్ గ్యాస్‌కు బదులుగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు, బేకరీలు, అలాగే ఇనుము కటింగ్ వంటి పనుల్లో కూడా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వం గృహ వినియోగదారుల కోసం ఎల్పీజీ గ్యాస్‌ను ప్రత్యేకంగా సరఫరా చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రకారం సబ్సిడీ ప్రయోజనాలు అందుతున్నాయి. అయితే గృహ వినియోగానికి ఉద్దేశించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వల్ల ప్రభుత్వం ఉద్దేశించిన సంక్షేమ లక్ష్యం దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల ప్రకారం గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరతో పోలిస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గణనీయంగా ఎక్కువగా ఉండటంతో, ఖర్చు తగ్గించుకునేందుకు కొందరు గృహ వినియోగ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ఎల్పీజీ సరఫరా నిబంధనల ప్రకారం గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించరాదు. వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినా స్పందన లేకపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారి సంఖ్య పెరుగుతోందని వారు చెబుతున్నారు.ఇలా గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఉద్దేశం దెబ్బతినడంతో పాటు, నిబంధనల ప్రకారం కమర్షియల్ గ్యాస్‌ను వినియోగిస్తున్న వ్యాపారులు అధిక ధర చెల్లిస్తుండగా, కొందరు గృహ వినియోగ గ్యాస్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో వ్యాపారం నిర్వహిస్తున్నారని, దీంతో నిబంధనలు పాటిస్తున్న వ్యాపారులు నష్టపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిని గుర్తించి ఎల్పీజీ సరఫరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జిల్లా స్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఇటువంటి అక్రమాలను అరికట్టాలని కోరుతున్నారు.




