JagityalaPoliticalTelangana

పార్టీ కోసం లక్షల్లో ఖర్చు.. అప్పులు, ఈఎంఐల ఒత్తిడి.. బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడి ఆత్మ*హత్య..

పార్టీ కోసం లక్షల్లో ఖర్చు.. అప్పులు, ఈఎంఐల ఒత్తిడి.. బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడి ఆత్మ*హత్య..

పార్టీ కోసం లక్షల్లో ఖర్చు.. అప్పులు, ఈఎంఐల ఒత్తిడి.. బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడి ఆత్మ*హత్య..

Social media viral : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ శనివారం సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

వృత్తిరీత్యా ఆర్‌ఎంపీ వైద్యుడైన జగన్‌ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. సేవా కార్యక్రమాలు, ప్రజలతో సన్నిహితంగా ఉండే స్వభావంతో ఆయనకు గ్రామంలో మంచి పేరు ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా కొనసాగిన ఆయన గ్రామ అభివృద్ధికి కృషి చేశారు.

అనంతరం బీఆర్ఎస్‌లో చేరి ఉమ్మడి వెల్గటూరు మండల కార్యదర్శిగా, ఆ తర్వాత ఎండపల్లి మండల అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. అయితే ఈ సమయంలో పార్టీ కార్యక్రమాల కోసం చేసిన అప్పులు, వాటికి సంబంధించిన ఈఎంఐల భారం క్రమంగా పెరగడంతో కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖలో వెల్లడించారు.

రాజకీయ కార్యకలాపాలు, వ్యక్తిగత ఖర్చులు, వివిధ రుణాల వాయిదాల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని అందులో వివరించారు. ‘అందరికీ నమస్కారం. ముందుగా అందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. చాలా బాధేస్తుంది.. కానీ తప్పడం లేదు. పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత ఖర్చులు, ఈఎంఐలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. వాటికి వడ్డీలు పెరిగి ఆర్థికంగా చాలా నష్టపోయాను.

అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఎవరికీ చెప్పలేక, ఏం చేయాలో తెలియక చాలా కాలంగా నరకం అనుభవిస్తున్నా. నా భార్య పల్లవికి, పిల్లలకు నేను చేసిన అన్యాయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల భవిష్యత్తు గురించి ఇప్పుడు భయంగా ఉంది. నా కుటుంబానికి నేను ఏమీ చేయలేకపోయాను. పల్లవి నన్ను క్షమించు.

నా అక్క, బావ, అన్న, వదిన, అత్తమామలు.. నా పిల్లలకు మీరే అండగా ఉండాలి. నాకు ఆర్థికంగా సహాయం చేసిన వారందరూ కొద్దిగా ఓపిక పట్టండి. నా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించండి. నాయకులు, స్నేహితులు నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. నిజంగా ఎంతో అద్భుతంగా బతికిన నాకు దేవుడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. నా పల్లవికి, పిల్లలకు దూరం అవ్వడం నా ఖర్మ.

గత కొద్ది రోజులుగా ప్రతి నిమిషం నరకంలా అనిపిస్తోంది. నా కుటుంబ భవిష్యత్తు ఆలోచిస్తే భయమేస్తోంది. దేవుడా.. వారిని చల్లగా చూడు. దయచేసి ఎవ్వరూ నాలా చేయకండి. గ్రామంలో నేను ఎవరినైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి.’ అని జగన్ లేఖలో పేర్కొన్నాడు.

జగన్‌ మృతి విషయం తెలియగానే బీఆర్ఎస్‌ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, సేవా గుణం కలిగిన నాయకుడిగా ఆయనను గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button