
సీఎం హామీకి మూడేండ్లు
టీపీసీసీ అధ్యక్షుని హోదాలో భరోసా..
అధికారంలోకి వచ్చాక విస్మరణ!
సమగ్ర శిక్షా ఉద్యోగుల్లో పెరిగిన నిరాశ
పే స్కేలు, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందుల్లో 19 వేల కుటుంబాల భవిష్యత్
హనుమకొండలోని ఏకశిలా పార్కు సాక్షిగా, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె శిబిరంలో నాటి టీపీసీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి నేటితో (2023 సెప్టెంబర్ 13) సరిగ్గా మూడేండ్లు పూర్తయ్యాయి. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది.. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ తీర్చి, పే స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాం’ అని అప్పట్లో ఇచ్చిన హామీలు.. నేడు నీటి మూటలుగా మారాయి. నాడు ధర్నా చౌక్ లో ఉద్యోగుల పక్షాన నిలిచి, నేడు ఏకంగా రాష్ట్ర పాలనా రథాన్ని నడుపుతూ విద్యాశాఖ బాధ్య తలను కూడా పర్యవేక్షిస్తున్న ఆయన తమ వైపు కన్నెత్తి చూడకపోవడంపై రాష్ట్రంలోని 19 వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, 2023 సెప్టెంబర్ 13న హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరసనకు నాటి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయం గా హాజరై సంపూర్ణ సంఘీభావం తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్య లన్నీ పరిష్కరిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు. నాటి వేదికపై ఉద్యోగులకు మద్దతు గా నిలిచిన పలువురు నాయకులు నేడు రాష్ట్ర మంత్రి వర్గం లో కీలక శాఖలు నిర్వర్తిస్తు న్నారు. అయిన ప్పటికీ, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా తమ సమస్యలపై కనీస సమీక్ష జరపక పోవడం, ఒక్కరు కూడా స్పందిం చకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
కాగితాలకే పరిమితమైన సమ్మె విరమణ ఒప్పందం
గతంలో సమ్మె సమయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కుదిరిన సమ్మె విరమణ ఒప్పందంలోని ప్రధానాంశాలు ఇప్పటికీ పెండింగ్ లోనే మూలుగుతున్నాయి.పే స్కేలు (బేసిక్ పే), ఉద్యోగ భద్రత అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మూడు నెలల్లోపు తుది నిర్ణయం తీసుకుం టామని చెప్పిన గడువు ఎప్పుడో ఏండ్లుగా కొనసాగుతున్న ‘రీ-ఎంగేజ్’ పేరుతో ఏటా రెండ్రోజుల పాటు ఉద్యోగులను విధి నిర్వహణ నుంచి తొలగించే వింత విధానాన్ని ఎత్తివేస్తామని చెప్పినా ఆచరణలోకి రాలేదు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించడం, ప్రమాదంలో ఉన్న వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడం వంటి ఆర్థికేతర హామీలు నెరవేరలేదు. ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడిన 29 రోజుల సమ్మె కాలపు బకాయి వేతనాలు కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు.
అస్థిరతలో 19 వేల కుటుంబాలు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఉద్యోగులు సమగ్ర శిక్షా విభాగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల నిత్యం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని వారు తెలిపారు. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త పీ ఆర్ సీ లో తమకు స్థానం కల్పించి, బేసిక్ పే అమలు చేయాలని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. స్వయంగా విద్యాశాఖ బాధ్య తలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడేండ్లుగా నెరవేరని హామీ
‘2023 సెప్టెంబర్ 13న ఏకశిలా పార్కు వద్ద మేము అధికారంలోకి రాగానే నెల రోజుల్లో పే స్కేలు ఇస్తాం’ అని మా చేయి పట్టుకుని సీఎం మాట ఇచ్చారు.ఆయన హామీ ఇచ్చి నేటికి మూడేండ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం వచ్చి ఏండ్లు గడుస్తున్నా మా సమస్యలు మాత్రం జాప్యం అవుతూనే ఉన్నాయి. హక్కుల కోసం పోరాడిన 29 రోజుల సమ్మె వేతనాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం స్పందించి తమ హామీని వెంటనే నిలబెట్టుకోవాలి.




