
రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ..
రైలు పట్టాల మీద నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్ లో భార్యకు చూపిస్తూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. బార్యభర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న కలహాలే ఈ విషాద సంఘటనకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. అయితే.. తన భర్త మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భ్రమపడిన లైట్ తీసుకున్న భార్య ఇప్పుడు బోరున విలపిస్తుంది.
ఈ విషాద సంఘటన హనుమకొండ కాజీపేట దర్గా సమీపంలోని తొమ్మిది మోరీల వద్ద జరిగింది.. ప్రకాష్ రెడ్డి ప్రాంతానికి చెందిన లావుడ్యా రాజేశ్‌నాయక్ (45) అనేవ్యక్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా రాజేష్ నాయక్ తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
భార్య అతని తల్లిదండ్రుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలో రాజేష్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.సరిగ్గా రాత్రి 10:30 నిమిషాల సమయంలో రైలు పట్టాల మీద నిలబడి భార్యకు వీడియో కాల్ చేశాడు.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు..
అయితే, రాజేష్ మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. రాత్రంతా ఇంటికి రాలేదు.. భార్య, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న క్రమంలో అతని మరణ వార్త తెలిసింది.. ఉదయం 6 గంటలకు రైలు పట్టాల మీద రాజేష్ మృతదేహం గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.రాజేష్ నాయక్ బలవన్మరణంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థలతో ప్రాణాలు తీసుకోవడం ద్వారా కుటుంబం రోడ్డున పడుతుంది.. కావున, పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.




