
రామకృష్ణాపురం 107 రైల్వే గేట్‌కు మోక్షం.. ఆర్ఓబీ నిర్మాణంపై కదిలిన రైల్వే శాఖ
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని, జూలై 21:
చింతకాని మండలంలోని రామకృష్ణాపురం సమీపంలోని 107 రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి ఎట్టకేలకు తొలి అడుగు పడింది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు, వివిధ పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన రైల్వే శాఖ ఉన్నతాధికారులు మంగళవారం గ్రామాన్ని సందర్శించి నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే రోడ్ సేఫ్టీ అధికారి సుందర్ సేన్, ఇతర అధికారులతో కలిసి రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ గాదె నాగలక్ష్మి, ఉపసర్పంచ్ గాదె రామారావు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైల్వే రోడ్ సేఫ్టీ అధికారి సుందర్ సేన్ మాట్లాడుతూ, ఆర్ఓబీ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణం కోసం భూములు కోల్పోయే రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు. భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందజేస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే సర్వే పనులు ప్రారంభించి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరిస్తే ఆర్ఓబీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో ఆర్ఐ ఏకవీర్, జీపీఓ మౌనిక, గ్రామ పంచాయతీ కార్యదర్శి నల్లగట్ల మురళీకృష్ణ, గ్రామ పెద్దలు తిరుపతి గోవిందరావు, తూము అంజయ్య, వార్డు సభ్యుడు పిన్నెల్లి శ్రీనివాస్, కొక్కిరేణి సీతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో 107 రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆర్ఓబీ నిర్మాణానికి అధికారుల హామీతో ఆశలు చిగురించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




