
ఆర్మీ జవాన్ మృతి..రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు
web desc : నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్‌షాకోట్ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టిన కారు.. స్థానికుల సమాచారం ప్రకారం.. మహీంద్రా XUV కారు రాంగ్ రూట్‌లో అత్యంత వేగంగా వచ్చి ముందుగా ఓ ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిపోయిన కారు మరికొందరిని కూడా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కారులో ఐదుగురు యువకులు.. ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగంతో పాటు రాంగ్ రూట్‌లో అడ్డగోలుగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న యువకుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




