
ఖమ్మంలో 2027 ‘సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్’ ఛాంపియన్‌షిప్..
- కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ రఘురాం రెడ్డి
- సూత్రప్రాయంగా అంగీకరించిన మన్సుఖ్ మాండవియా
- ఎంపీ కృషి పట్ల ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ హర్షం
న్యూ ఢిల్లీ: భారతదేశ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న 17వ ‘సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్-2027’ నిర్వహణకు వేదికగా ఎంపికైన తెలంగాణలోని ఖమ్మం నగరంలో క్రీడా సంబరానికి మార్గం సుగమమవుతోంది. ఈ మేరకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాను కలిసి విజ్ఞప్తి చేశారు.భూటాన్ రాజధాని థింపూలో జూలై 1, 2026 న జరిగిన సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (SABPF) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మంలో నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన విషయాన్ని ఎంపీ రఘురాం రెడ్డి స్వయంగా కేంద్ర క్రీడామంత్రిని కలిసి, టోర్నమెంట్ నిర్వహణకు ఆమోదం తెలపాలని కోరారు.
పలు వివరాలు తెలిపిన ఎంపీ రఘురాం రెడ్డి
సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (SABPF) నిర్ణయం మేరకు జరగనున్న ఈ మహాసమరానికి ఖమ్మం ఎంపికవడం స్థానిక క్రీడాకారులకు ఎంతో గర్వకారణమని, దక్షిణ ఆసియా దేశాల నుంచి దాదాపు 150 మంది అథ్లెట్లు, 300 మందికి పైగా టెక్నికల్, ఇతర అధికారులు ఈ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. భారతీయ అథ్లెట్లు తమ సత్తా చాటుకునేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని,
కేంద్ర ప్రభుత్వం నుంచి లాంఛనప్రాయ ఆమోదం (NOC) లభించిన వెంటనే, SABPFతో చర్చించి పోటీల ఖచ్చితమైన తేదీలు, షెడ్యూల్‌ను నిర్వాహకులు ఖరారు చేస్తారని వివరించారు.
ఎంపీ కృషి పట్ల ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ హర్షం
అంతర్జాతీయ క్రీడా వేదికగా ఖమ్మం కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి చేరేలా ఎంపీ రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంపై క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్.. ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.




