
ఆస్పత్రి మరుగుదొడ్డిలో పసికందు మృ*తదేహం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన!
WEB DESC : సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒళ్లు గగుర్పొడిచే విషాదకర సంఘటన ఒకటి బయటకు వచ్చింది. స్థానిక సిహెచ్సి ఆసుపత్రిలోని మరుగుదొడ్డిలో ఓ మగ బిడ్డ చనిపోయి పడి ఉన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కావాలనే పడేసి పోయారా..?
ఈ నెల 7వ తేదీన పేట ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న బాత్రూంలో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఎవరో వచ్చి అప్పుడే పుట్టి చనిపోయిన మగ బిడ్డ ను మరుగుదొడ్డిలో పడేసి వెళ్లారు.
కాగా ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది అదే రోజు మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఇది చూసి ఒక్కసారిగా వారంతా షాక్‌కి గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రి పర్యవేక్షకుడు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరుగుదొడ్డిలో మగ బిడ్డ ఎలా చనిపోయాడు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు..పేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నవజాత మగ శిశువు ఎలా చనిపోయింది. ఆ బిడ్డకు తల్లి ఎవరు అనే విషయాలను పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా స్థానిక ఆశ వర్కర్ల ద్వారా ఆ రోజు ఎక్కడెక్కడ ప్రసవాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఈ విషయాన్ని చేరవేసి మృతి చెందిన చంటి బిడ్డ తల్లి ఎవరు అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు సీఐ వెంకటేష్ దిశతో మాట్లాడుతూ తెలిపారు.
బయట వ్యక్తులే ఇక్కడ పడేసి వెళ్లారు:విజయ్ శంకర్, ఆసుపత్రి పర్యవేక్షకుడు అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఎవరో కావాలని చంపేసి మృతి చెందిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగా పథకం ప్రకారంగానే ఆసుపత్రి బాత్రూంలో పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న మా ఆసుపత్రిలో కేవలం ఒక ప్రసవం మాత్రమే జరగగా ఆ మహిళకు ఆడపిల్ల పుట్టింది. ఇక్కడ జన్మించిన ఆడపిల్ల బ్లడ్ గ్రూప్ O నెగిటివ్.
కానీ మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిన మగ బిడ్డ బ్లడ్ గ్రూప్ మాత్రం O పాజిటివ్ గా తేలింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది మా సిబ్బంది సహకారంతోనే చనిపోయిన మగ బిడ్డను ఇక్కడ తెచ్చి మరుగుదొడ్డిలో వేసినట్లు మాకు అనుమానం కలుగుతోంది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశాము. అక్రమ సంబంధం నేపథ్యంలో ఎక్కడో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం అనంతరం బిడ్డను కావాలనే చంపి ఇక్కడ పడేసి వెళ్లినట్లుగా స్పష్టమవుతుందని తెలిపారు.




