
యూకేజీ విద్యార్థిని కొట్టిన టీచర్…కుప్పకూలిన బాలుడు..
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదింది. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు.
ప్రణయ తేజ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థి. గురువారం ఉదయం 11.20 గంటలకు స్కూల్లో విషాద ఘటన జరిగింది. హోం వర్క్ చెయ్యలేదని టీచర్ కొడుతుంటే అతడు బాగా భయపడిపోయి, కుప్పకూలాడు.
స్కూల్లో బాలుడు పడిపోయిన వెంటనే సీపీఆర్ చేశారు మరో టీచర్. ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు బాలుడిని టీచర్లు కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. కేజీహెచ్‌కు తీసుకొచ్చిన వెంటనే ఈసీజీ సహా పలు టెస్టులు చేసి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
విశాఖలో ఈ విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్ వద్ద కూడా ఆ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.




