
బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
social media viral : 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 45 ఏళ్ల జిమ్నాస్టిక్ కోచ్ పై మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై ఉపనగర జిల్లా విలెపార్లే ప్రాంతానికి చెందిన బాలిక ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలైన బాలిక కొన్నేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇంటి వద్ద చదువుకుంటున్న బాలికకు కోచ్ వాట్సాప్‌లో ‘హాయ్’ అంటూ మెసేజ్ పంపాడు. దీంతో కోచ్‌ను సంప్రదించి విషయం తెలుసుకోవాలని బాలిక తల్లి సూచించింది.
అనంతరం బాలికను జిమ్నాసియంకు రావాలని, కలిసేందుకు సమయం ఉందా అని కోచ్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో బాలిక అక్కడికి వెళ్లగా.. ఒంటరిగా ఉన్న కోచ్ ఆమెను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కడ నుంచి ఎలాగొలా బయటపడిన ఆ బాలిక కాలేజీకి వెళ్లిపోయింది. ముభావంగా ఉన్న ఆమెను పీఈటీ గమనించి ఆరా తీశారు.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు టీచర్ వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విలెపార్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.




