
రోడ్డుపై కంకర దిబ్బ.. వాహనదారులకు తప్పని తిప్పలు
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 23 2026: ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండా నుంచి శ్రీరాంపురం వరకు నూతనంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, కంకరను తిమ్మారావుపేట నుంచి ముచ్చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై పోశారు. అయితే కంకరను పూర్తిగా పక్కకు తొలగించకుండా రోడ్డుకు సగం మేర దిబ్బగా ఉంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారిపై సగభాగాన్ని ఆక్రమించేలా కంకర దిబ్బ ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు మిగిలిన కొద్దిపాటి స్థలమే అందుబాటులో ఉంటోంది. దీంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కంకరను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం నెలకొంది.
ఇప్పటికే రోడ్డుపై ఉన్న కంకర దిబ్బ కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. కంకరపై వాహనం అదుపుతప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా పెద్ద వాహనం అదుపుతప్పినా, ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు కంకర అవసరమైనప్పటికీ, ప్రధాన రహదారిపై సగం మేర దిబ్బగా పోసి ఉంచడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పగటిపూట పరిస్థితి కొంతవరకు కనిపించినప్పటికీ రాత్రి వేళల్లో కంకర దిబ్బ సరిగా కనిపించకపోవడంతో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై సగం మేర ఉన్న కంకర దిబ్బను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు పూర్తిస్థాయిలో మార్గం కల్పించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కాకుండా.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంకర దిబ్బను తొలగించి మరో ప్రమాదం జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.




