KhammamPoliticalTelangana

పాత రేట్లతో పరిహారం వద్దు.. సవరించిన ధరలే చెల్లించాలి

పాత రేట్లతో పరిహారం వద్దు.. సవరించిన ధరలే చెల్లించాలి

పాత రేట్లతో పరిహారం వద్దు.. సవరించిన ధరలే చెల్లించాలి

సీతారామ భూసేకరణ.. పరిహారంపై రైతుల ఆవేదన

సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసిత రైతుల వినతి

సీకే న్యూస్‌ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఆగస్టు 24 2026: సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూములు కోల్పోతున్న తమకు పాత మార్కెట్‌ విలువల ప్రకారం కాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న సవరించిన మార్కెట్‌ విలువల ఆధారంగా పరిహారం చెల్లించాలని బురద రాఘవాపురం రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు ఏన్కూరు తహశీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం అవార్డు నంబర్‌ Rc.No.C/72/2020, తేదీ 17-02-2021 ఆధారంగా సీతారామ ఎత్తిపోతల పథకం కోసం తమ భూముల సేకరణకు 2020లో నిర్ణయించిన మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం ఖరారు చేసినట్లు రైతులు తెలిపారు. అయితే అవార్డు జారీ చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరగడంతో తమ భూముల వివరాలు తిరిగి రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయని, ప్రస్తుతం కూడా ఆయా భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. వ్యవసాయమే తమకు ప్రధాన జీవనాధారమని, భూములను కోల్పోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని కోరారు.

ఇటీవల ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను సవరించిందని, సీతారామ ప్రాజెక్టు పరిధిలోని పలు గ్రామాల రైతులకు సవరించిన మార్కెట్‌ విలువ ఆధారంగా పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే తమ విషయంలో మాత్రం 2020లో నిర్ణయించిన పాత మార్కెట్‌ విలువ ఆధారంగా పరిహారం చెల్లించేందుకు అధికారులు ప్రయత్నించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క గ్రామాల రైతులకు సవరించిన మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తూ, తమకు మాత్రం పాత రేట్లు వర్తింపజేయడం సరికాదని రైతులు అన్నారు. తమ భూముల ప్రస్తుత విలువను పరిగణనలోకి తీసుకుని సవరించిన మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం నిర్ణయించాలని కోరారు. ప్రాజెక్టు పనులకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లిస్తే తమ భూములను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

పేద రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి, పక్క గ్రామాల రైతులతో సమానంగా తమకు కూడా సవరించిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులందరికీ న్యాయబద్ధమైన, సముచితమైన పరిహారం అందించాలని వారు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button