
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..!
web desc : తాగుడుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లినే కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో కలకలం రేపింది.మద్యం కోసం తల్లితో గొడవపడిన కుమారుడు ఆగ్రహంతో రోకలిబండతో ఆమె తలపై బలంగా మోది దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన తల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం ప్రకారం.. రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీతో ఆమె కుమారుడు షేక్ సుభాని మధ్య మద్యం కోసం డబ్బులు ఇవ్వాలనే విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. మద్యానికి బానిసైన సుభాని డబ్బుల కోసం తల్లిని వేధించేవాడని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తల్లితో సుభాని గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆగ్రహానికి గురైన సుభాని రోకలిబండతో సైదాబీ తలపై బలంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సుభాని భార్య ఏడాది క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతడు తల్లితో కలిసి ఉంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
తల్లిని కుమారుడే హత్య చేసిన ఘటనతో రఘునాధపాలెంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. హత్యకు దారి తీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.




