PoliticalTelanganaVikarabad

పని చేసింది నవీన్‌.. పేమెంట్ మమత పేరుతోనా?

పని చేసింది నవీన్‌.. పేమెంట్ మమత పేరుతోనా?

పని చేసింది నవీన్‌.. పేమెంట్ మమత పేరుతోనా?

  • పని చేసింది ఒకరు…పేమెంట్ ఇచ్చింది మరొకరికి
  • గొట్లపల్లి గ్రామపంచాయతీలో రూ.29,916 చెల్లింపుపై వివాదం
  • ఒకే బిల్లుకు రెండు నోట్‌ఫైళ్లు ఎందుకు?
  • నోట్‌ఫైల్‌ లలో తేడాలెందుకు?
  • తాను చేసిన వీధిదీపాల పనికి బదులుగా మరో వ్యక్తి పేరుతో పేమెంట్ చేశారని గొట్లపల్లి గ్రామస్థుడు బంగారు నవీన్ ఆరోపణ
  • ఆర్టీఐ ద్వారా వచ్చిన నోట్‌ఫైల్, గ్రామస్వరాజ్‌లోని నోట్‌ఫైల్ వేర్వేరుగా ఉన్నాయంటూ ఆవేదన
  • గొట్లపల్లి పంచాయతీలో చెల్లింపుల గందరగోళం

సికె న్యూస్ పెద్దేముల్ ప్రతినిధి ,సెప్టెంబర్ 11

గ్రామపంచాయతీలో తీర్మానం తీసుకొని,అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తి చేసినప్పటికీ తనకు రావాల్సిన బిల్లును చెల్లించకుండా మరో వ్యక్తి పేరుతో చెల్లింపు చేశారని గొట్లపల్లి గ్రామానికి చెందిన బంగారు నవీన్ ఆరోపించారు.తనకు రావాల్సిన రూ.29,916 రూపాయలను గతంలో గొట్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రాజు భార్య నర్ల మమత పేరుతో చెల్లించారని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మీడియా ఎదుట తన గోడును వెల్లడించారు.

తీర్మానంతో వీధిదీపాల ఏర్పాటు

గొట్లపల్లి గ్రామానికి చెందిన బంగారు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామంలో వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు 2025 ఫిబ్రవరి 12న గ్రామపంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు.ఆ తీర్మానం మేరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో తాను వీధిదీపాల ఏర్పాటు పనులు చేపట్టి 2025 ఫిబ్రవరి 20 నాటికి పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

పనులు పూర్తయిన అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఏఈ వినోద్‌కుమార్ ద్వారా 2025 జూన్ 20న ఎంబీ రికార్డు నమోదు చేసినట్లు నవీన్ తెలిపారు.మొత్తం పనికి జీఎస్టీతో కలిపి సుమారు రూ.36 వేల బిల్లు నమోదు కాగా, జీఎస్టీ రూ.5,598 మినహాయించిన తర్వాత తనకు రూ.29,916 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

‘డబ్బులు లేవు’.. కానీ చెల్లింపు జరిగినట్లు యాప్‌లో

తన బిల్లు చెల్లింపు కోసం పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు సంప్రదించగా గ్రామపంచాయతీలో నిధులు లేవని,పేమెంట్ కాలేదని సమాధానం ఇచ్చారని నవీన్ తెలిపారు.దీంతో కొంతకాలం వేచి చూసిన అనంతరం ‘మేరీ పంచాయతీ’ యాప్‌లో తన పనికి సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించగా,రూ.29,916లను తనకు బదులుగా నర్ల మమత పేరుతో చెల్లించినట్లు కనిపించిందని ఆరోపించారు.

తాను ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి పరమేష్ దృష్టికి తీసుకెళ్లగా,అనంతరం తనకు కూడా చెల్లింపు చేస్తామని చెప్పారని నవీన్ తెలిపారు.ఇందులో భాగంగా తాను రూ.20 వేలు, ఉపసర్పంచ్ బంటు చంద్రప్ప రూ.10 వేలు కలిపి మొత్తం రూ.30 వేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు చెల్లింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీఐతో ఫిర్యాదు.. విచారణపై మరో ప్రశ్న

తనకు రావాల్సిన బిల్లును ఇతరుల పేరుతో చెల్లించారనే ఆరోపణలపై 2026 జూలై 31న సమాచార హక్కు చట్టం-2005 కింద పెద్దేముల్ ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు నవీన్ తెలిపారు.దీనిపై ఆగస్టు 12న ఎంపీఓ రతన్‌సింగ్ గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారని చెప్పారు.

అయితే విచారణకు సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వలేదని, దీంతో తాను విచారణ సమయంలో అక్కడ అందుబాటులో లేకపోయానని నవీన్ ఆరోపించారు. అదే రోజున విచారణ పూర్తిచేశారని తెలిపారు. విచారణలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరికి నోటీసులు ఇచ్చారు? ఎవరిని విచారించారు? ఎవరి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు? ఎవరు విచారణకు హాజరయ్యారు అనే వివరాలను తెలుసుకునేందుకు మళ్లీ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినట్లు నవీన్ తెలిపారు.

రెండు నోట్‌ఫైళ్లు.. అసలు ఏది?

ఈ వ్యవహారంలో మరో అంశం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని నవీన్ పేర్కొన్నారు.ఈ గ్రామ్ స్వరాజ్ యాప్‌లో గ్రామపంచాయతీ నుంచి అప్‌లోడ్ చేసిన నోట్‌ఫైల్‌ను పరిశీలించగా ఒక విధంగా ఉండగా, ఆర్టీఐ ద్వారా తనకు అందించిన నోట్‌ఫైల్ మరో విధంగా ఉందని ఆరోపించారు.ఆర్టీఐ ద్వారా అందిన నోట్‌ఫైల్‌లో రూ.29,916ల చెల్లింపుకు సంబంధించి తన పేరుతో బిల్లు ఉండటంతో పాటు సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఉన్నట్లు తెలిపారు.

అదే సమయంలో గ్రామస్వరాజ్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన నోట్‌ఫైల్‌లో తన పేరు కనిపించలేదని పేర్కొన్నారు.ఒకే చెల్లింపునకు సంబంధించి రెండు వేర్వేరు నోట్‌ఫైళ్లు ఎలా ఉండగలవని ఆయన ప్రశ్నించారు.యాప్‌లో అప్‌లోడ్ చేసిన నోట్‌ఫైల్‌లో తన పేరు లేకపోవడంపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

‘చేసిన పనికి బిల్లు నాకే రావాలి’

గ్రామపంచాయతీ తీర్మానం మేరకు తానే వీధిదీపాల పనులు చేపట్టానని, పనులు పూర్తిచేసిన తర్వాత ఎంబీ రికార్డు కూడా నమోదు చేశారని నవీన్ తెలిపారు.అలాంటప్పుడు తనకు రావాల్సిన రూ.29,916లను మరో వ్యక్తి పేరుతో చెల్లించడం ఎలా జరిగిందో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారంలో వాస్తవాలకు భిన్నంగా లేదా అనుమానాలకు తావిచ్చే పత్రాలు అందించినట్లయితే దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

గొట్లపల్లి గ్రామపంచాయతీలో తన బిల్లు చెల్లింపు విషయంలో జరిగిన పరిణామాలపై సమగ్ర శాఖాపరమైన విచారణ చేపట్టాలని నవీన్ కోరారు. తనకు రావాల్సిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం తనకు చెల్లించాలని, చెల్లింపు ప్రక్రియలో తప్పిదం లేదా అక్రమం జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే సమాచార హక్కు చట్టం కింద తాను కోరిన సమాచారంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బంగారు నవీన్ డిమాండ్ చేశారు.

పెద్దేముల్ మండల ఎంపీఓ రతన్ సింగ్ వివరణ

గొట్లపల్లి గ్రామ పంచాయతీలో తాను చేసిన పనికి రావలసిన బిల్ పేమెంట్ విషయంలో గందరగోళం జరిగిందని గొట్లపల్లి గ్రామస్థుడు బంగారు నవీన్ ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేశారు.ఎంపీడీవో ఆదేశాల మేరకు గొట్లపల్లి గ్రామపంచాయతీలో తాను విచారణ చేపట్టి గ్రామపంచాయతీ రికార్డ్స్, ఎంబి రికార్డు, నోట్ ఫైల్, గ్రామ పంచాయతీ తీర్మానం అన్ని పరిశీలించి సర్పంచ్ తో మాట్లాడడం జరిగిందని అన్నారు.

సర్పంచ్ జవాబు ఇస్తూ గొట్లపల్లి గ్రామస్తుడు అయిన బంగారు నవీన్ కు వీధి దీపాలకు సంబంధించి బిల్ గ్రామపంచాయతీ నుండి ఇవ్వాల్సి ఉందని తనకు తెలిపారని అన్నారు.నోట్ ఫైల్ లో సర్పంచ్,ఉపసర్పంచ్, సెక్రటరీ సంతకాలతో పాటు గ్రామ పంచాయతీలో పనులు చేసిన బంగారు నవీన్ పేరు కూడా ఉందని గమనించి అన్ని పరిశీలించి విచారణ పూర్తి చేయడం జరిగిందని అన్నారు.

కాకపోతే గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం పని చేసింది ఒకరైతే వేరే ఇంకొకరి పేరు మీద వీధి దీపాలకు సంబంధించి పేమెంట్ కావడం జరిగిందని, ఇది ముమ్మాటికి పంచాయతీ కార్యదర్శి పరమేష్ నిర్లక్ష్యంతో తప్పు జరిగిందని భావించి అందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పరమేష్ కు మెమో కూడా జారీ చేయడం జరిగిందని ఎంపీఓ రతన్ సింగ్ వివరణలో తెలిపారు. తదుపరి విచారణ పూర్తి చేసి నివేదికను మండల ఎంపీడీవోకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button