
రైలు కింద పడి తండ్రీకొడుకుల ఆత్మ*హత్య
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఇద్దరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ వద్ద రైలు కింద పడి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం.కాగా, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన నేరాలకు సంబంధించి ఇటీవల కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆర్థిక ఇబ్బందులతో వారు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.
ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన దొంత మల్లేశం (50), నాగరాజు (23) అనే ఇద్దరు తండ్రీకొడుకులు కాగా, తండ్రి మల్లేశం కొంతకాలం క్రితమే భార్యను కోల్పోయాడు. కొడుకు నాగరాజుకు ఇంకా పెళ్లి కాలేదు. గత నాలుగు ఏళ్ల క్రితం గుల్లకోట గ్రామానికి చెందిన పంగ రమేష్ అనే కార్యదర్శి భూపాలపల్లి ఏరియాలో హత్యకు గురయ్యారు. ఈ హత్య నేరంలో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించి అప్పుడే వారిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ నేరంలో ఇద్దరు జైలుకు పోయి ఇటీవలే బెయిల్ పై విడుదలైనట్లు సమాచారం.
అప్పటి నుంచి మంచిర్యాలలో కొద్దిరోజులు నివాసం ఉంటుండగా మరో కేసు వీరిపై నమోదైనట్లు తెలిసింది. పాత కేసుల భయంతో వీరు ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల వీరు కరీంనగర్‌లో ఉంటున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లో అద్దెకు గది తీసుకొని కొడుకు హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, తండ్రి కూలీకి వెళ్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిని గతంలో వారు చేసిన నేరాలు వెంటాడుతున్నాయి. వాటికి సంబంధించి ఇటీవల వారెంట్ కూడా జారీ అయింది. తిరిగి తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం వారిని వెంటాడుతుంది.
ఆ భయంతోనే వారం రోజుల క్రితం స్వగ్రామమైన గొడిసెలపేటకు వచ్చి వెళ్లారని తెలిసింది. ఇరుగుపొరుగు, తోటి వారి వద్ద తమ బాధను వెళ్లగక్కినట్లు సమాచారం. కాగా, అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లిపోయారు. అయితే మంచిర్యాలలో మల్లేశానికి బంధువులు ఉంటారని, అక్కడికి వారిని కలవడానికి వెళ్లి ఉండవచ్చు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు, కేసులు వారిని వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో వారు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
కాగా, కరీంనగర్‌లో ఉండేవారు అక్కడికి ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారు, వెళ్లిన వారు బంధువులను కలిశారా, వారి మృతికి ముందు ఏం జరిగిందనేది తెలియరాలేదు. ఆత్మహత్యకు ముందు పాత కేసులకు సంబంధించిన గొడవలు ఏమైనా జరిగాయా అన్నది తెలియాల్సి ఉంది. రైలు ప్రమాద ధాటికి తండ్రీకొడుకుల శరీరాలు ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయి భయానక దృశ్యాన్ని తలపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




