
ఏన్కూరులో శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి శ్రీకారం
శుభముహూర్తంలో ప్రారంభమైన నిర్మాణ పనులు.. ప్రత్యేక పూజలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ
ఏన్కూరు సెప్టెంబర్ 16 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయ నిర్మాణ పనులు బుధవారం శుభముహూర్తంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది.
ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తికావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు కొనసాగాలని భక్తులు ఆకాంక్షించారు. శ్రీ కోదండ రామాలయం నిర్మాణం పూర్తయితే ఏన్కూరు మండల ప్రజలతో పాటు పరిసర గ్రామాల భక్తులకు కూడా ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుంది.
ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు సహకరించి తమ వంతు తోడ్పాటు అందించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




