
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
హైదరాబాద్: నగరంలో ఎంతో కోలాహలంగా సాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. నిమజ్జన ఊరేగింపును వీక్షించడానికి, ఖైతరాబాద్ గణేష్ శోభాయాత్ర వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆ వ్యక్తి, ప్రమాదవశాత్తూ ఒక వాహనం కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద సంఘటన ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉన్న మెట్రో పిల్లర్ నంబర్ 1167 సమీపంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదవశాత్తూ చనిపోయిన వ్యక్తి వివరాలు, అలాగే ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల అత్యుత్సాహం వల్లే యువకుడు మృతి చెందాడని ఆరోపణలు
ఖైరతాబాద్ వద్ద గణేష్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్న యువకులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో, భయాందోళనకు గురైన 20 ఏళ్ల యువకుడు తప్పించుకునే క్రమంలో ఒక ట్రక్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి స్నేహితులు, తోటి యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువకుడి మృతికి నిరసనగా అతడి స్నేహితులు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ విషాదానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో శోభాయాత్ర వేళ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే నిరసన వ్యక్తం చేస్తున్న యువకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాగిపడేస్తూ, ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిమజ్జనం వేళ భక్తుడు మృతిచెందడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.




