
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మ*హత్య…
Web desc : వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు సాగించిన వేధింపులు భరించలేక ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఊరి శివారులోని వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు కొంతకాలంగా సదరు మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం బయటకు రావాలంటూ ఆ యువకుడు బాలికకు పదే పదే ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి గురిచేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకుడి వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, ఎవరికీ చెప్పకుండా ఊరి శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
దీనిని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పరిగి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి, బావిలో నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక మైనర్ బాలిక ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో రావులపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.




