
తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టుపై మహిళా ఆర్‌ఐ దురుసు ప్రవర్తన!
Web desc : ఆసిఫ్‌నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో మహిళా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) స్వాతి రౌడీయిజం ప్రదర్శించారు. విధి నిర్వహణలో భాగంగా వచ్చిన జర్నలిస్టుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడారు. కార్యాలయం సాధారణ సమయం దాటి పోయినప్పటికీ రాత్రి వేళ ఆసిఫ్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయం తెరిచి ఉండడాన్ని గమనించిన ‘ఓ పత్రిక’ విలేకరి వివరాలు సేకరించేందుకు లోపలికి వెళ్లారు.
ఎమ్మార్వో ఆఫీసు ప్రాంగణంలోని చీకటి ప్రాంతంలో ఆర్‌ఐతో పాటు మరో మహిళ, ఇద్దరు ఆఫీసు సిబ్బంది, బయటి వ్యక్తులు ఉండటాన్ని గమనించి ప్రశ్నించగా ఆర్‌ఐ స్వాతి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. “నువ్వు ఎవడ్రా లోపలికి రావడానికి?” అంటూ దురుసుగా ప్రవర్తించారు.
విలేకరి తాను జర్నలిస్టునని పరిచయం చేసుకున్నప్పటికీ లెక్కచేయకుండా దుర్భాషలాడారు. “ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం” అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే సమయంలో విలేకరి ఫోన్ తీసి ఫోటోలు తీస్తుండగా కార్యాలయం నుంచి సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జర్నలిస్టుపై ధౌర్జన్యానికి దిగిన ఆర్‌ఐ స్వాతిపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు, స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆఫీస్ తెరిచి ఉంచడం పై ప్రశ్నించిన విలేకరి పట్ల ఆర్‌ఐ ప్రవర్తించిన తీరుపై ఆసిఫ్‌నగర్ ఎమ్మార్వో జ్యోతిని వివరణ కోరగా.. ఈ విషయంపై తాను తెలుసుకుంటానని సమాధానమిచ్చారు.
ఇదే అంశంపై హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణను వివరణ అడగ్గా.. సదరు మహిళా ఆర్‌ఐ స్వాతిపై ఇప్పటికే రెండు మూడు ఫిర్యాదులు వచ్చాయని, ఆమె రూడ్‌గా ప్రవర్తిస్తోందని అంగీకరించారు. త్వరలోనే ఆమెపై తగిన చర్యలు తీసుకుని, ఆ స్థానం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.




