KhammamPoliticalTelangana

వాగులో దిగబడిన బొలెరో.. ఎప్పుడు నిర్మిస్తారు బ్రిడ్జి?

వాగులో దిగబడిన బొలెరో.. ఎప్పుడు నిర్మిస్తారు బ్రిడ్జి?

మంజూరై ఏళ్లు గడుస్తున్నా ప్రారంభంకాని పనులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

ఆరికాయలపాడు – జన్నారం మధ్య తప్పని వాగు కష్టాలు.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 13 2026: ఏన్కూరు మండలం ఆరికాయలపాడు – జన్నారం గ్రామాల మధ్య వాగు దాటాలంటే వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. వాగుపై శాశ్వత బ్రిడ్జి లేకపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా జన్నారం నుంచి పంగిడికి వెళ్తున్న బొలెరో వాహనం వాగులో దిగబడటంతో ఈ మార్గంలోని ప్రమాదకర పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. వాహనం వాగులో చిక్కుకుపోవడంతో స్థానిక యువకులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటనతోనైనా సంబంధిత అధికారుల్లో కదలిక వస్తుందా? అనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే మంజూరు లభించినప్పటికీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పుడు కనిపించే హడావుడి.. నిర్మాణ పనుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

వర్షాకాలంలో వాగులో నీరు ప్రవహించే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, వ్యవసాయ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చినా ఇదే మార్గం సమస్యగా మారే ప్రమాదం ఉంది.

ప్రమాదం జరిగాక స్పందిస్తారా?

ప్రజలు ప్రమాదాలను ఎదుర్కొంటున్నా అధికారులు, సంబంధిత నిర్మాణ శాఖ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరో వాహనం వాగులో చిక్కుకోవడమో, ప్రాణనష్టం సంభవించడమో జరిగితేనే అధికారులు స్పందిస్తారా? అని నిలదీస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు వచ్చిన తర్వాత కూడా పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను అధికారులు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి

సంబంధిత అధికారులు ఇకనైనా కాలయాపనకు స్వస్తి పలికి బ్రిడ్జి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు వాగు దాటేందుకు సురక్షితమైన తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న వాగు దారికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. మంజూరైన బ్రిడ్జి కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిర్మాణం ప్రారంభమయ్యేలా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button