
ఏన్కూరులో ఎస్వీఎస్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం
స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు.. ప్రజలకు అందుబాటులోకి ఫిజియోథెరపీ చికిత్సలు
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎస్సై సంధ్య, ప్రజాప్రతినిధులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 20 2026: ఏన్కూరు మండల ప్రజలకు ఫిజియోథెరపీ వైద్య సేవలను చేరువ చేసేందుకు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీఎస్ ఫిజియోథెరపీ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఏన్కూరు ఎస్సై నారబోయిన సంధ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, మాజీ చైర్మన్ భూక్య లాలు, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, ఆదివాసీ నాయకుడు శ్రీకాంత్ తదితరులు హాజరై రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బి. గాంధీని కలిసి కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిజియోథెరపీ చికిత్సల కోసం గతంలో మండల ప్రజలు ఖమ్మం, కొత్తగూడెం వంటి పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు.
ప్రస్తుతం ఏన్కూరు మండల కేంద్రంలోనే ప్రత్యేక ఫిజియోథెరపీ కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. దీనివల్ల రోగులకు ప్రయాణ ఇబ్బందులు, సమయం, ఖర్చు తగ్గడంతోపాటు స్థానికంగానే అవసరమైన వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కేంద్రంలో మెడ, భుజాలు, నడుము, మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు, పక్షవాతం అనంతర పునరావాస చికిత్సలు, శస్త్రచికిత్స అనంతర ఫిజియోథెరపీ సేవలతోపాటు చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి సంబంధించిన సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రమణతోపాటు పలువురు స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.




