PoliticalsuryapetaTelangana

ప్రజావాణిలో కలెక్టర్ పై కలెక్టర్ కే ఫిర్యాదు..

ప్రజావాణిలో కలెక్టర్ పై కలెక్టర్ కే ఫిర్యాదు..

ప్రజావాణిలో కలెక్టర్ పై కలెక్టర్ కే ఫిర్యాదు..

సూర్యాపేట ప్రజావాణి కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. కొందరు రైతులు తమ పట్టా భూములను భూభారతి నిషేధిత జాబితా(22-ఏ)లో అధికారులు ఉద్దేశపూర్వకంగా చేర్చారని, ఇందుకు బాధ్యులైన కలెక్టర్​తో పాటు ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు అందజేశారు.

భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన మేళ్లచెరువు జీపీవో, మేళ్లచెరువు తహసీల్దార్​, హుజూర్​నగర్ ఆర్డీవో, జిల్లా అదనపు కలెక్టర్, కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మేళ్లచెరువు సర్వే నంబర్ 1057లో మొత్తం 631 ఎకరాలు ఉండగా, అందులో 18.15 ఎకరాలు ప్రభుత్వ భూమి, 8.06 ఎకరాలు సీలింగ్ భూమి, 156 ఎకరాలు భూదాన్ భూమి కాగా 463.02 ఎకరాలు పట్టా భూమిగా ఉన్నట్లు రైతులు తెలిపారు.

ఇందులో 130 ఎకరాలు మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ వద్ద ఉండగా, మిగిలిన 333 ఎకరాలు రైతుల వద్ద ఉన్నాయని వివరించారు. రైతుల వద్ద ఉన్న భూమిలో 220 ఎకరాలను ప్రభుత్వ, సీలింగ్ భూములుగా చూపిస్తూ ఇటీవల భూభారతి నిషేధిత జాబితాలో చేర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో మైహోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద ఉన్న ప్రభుత్వ, సీలింగ్ భూములను మాత్రం నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. రైతుల పట్టా భూములను విచారణ లేకుండా 22-ఏ జాబితాలో చేర్చిన కలెక్టర్​, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులు సమర్పించిన ఆధారాలపై కలెక్టర్ నందలాల్​ స్పందించారు. తహసీల్దార్ ను నివేదిక కోరారు. కేసును విచారణకు షెడ్యూల్ చేయాలని ఈ -సెక్షన్ అధికారులను ఆదేశించారు.

తనపై వచ్చిన ఫిర్యాదును తానే విచారణకు ఆదేశించడం చర్చనీయాశంగా మారింది. ఇదే అంశంపై రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహాను కూడా కలిసినట్లు అడ్వకేట్ కమతం నాగార్జున తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button