
లిఫ్ట్ ఇచ్చిన కారు యజమానిపై కత్తితో దాడి
మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన ఓ కారు యజమానిపైనే దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి వ్యక్తిగత పని నిమిత్తం తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు.
మార్గమధ్యలో నార్కట్‌పల్లి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో, ఇమ్రాన్ మానవత్వంతో అతడిని కారులోకి ఎక్కించుకున్నారు.
అయితే, కారు చిట్యాల పరిసర ప్రాంతాలకు చేరుకోగానే, వెనుక సీట్లో కూర్చున్న దుండగుడు అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తిని తీసి ఇమ్రాన్‌పై దాడి చేశాడు.
ఇమ్రాన్ మెడ, శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడిచి, అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదును లాక్కోవడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ నిందితుడిని ధైర్యంగా ఎదర్కొనడంతో భయపడిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.
నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు..
రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.



