
“దయన్నకు చెబితే మంత్రికి చేరినట్టే.. పని జరిగినట్టే”
వ్యూహకర్త.. విశ్వసనీయతకు నిలువెత్తు సాక్ష్యం!
ఈనెల 10న పొంగులేటి ‘మహాబలం’ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదినం
సమస్య ఏదైనా.. దయన్నే పరిష్కార వేదిక…
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పటంలో ఆయనొక అజేయ శక్తి. ప్రతి పల్లెకూ ఆయన పేరు ఒక భరోసా. వ్యూహం ఆయన ఇంటి పేరు.. నమ్మకం ఆయన నైజం.
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కవచంలా, ఆయన రాజకీయ సామ్రాజ్యానికి అపర చాణక్యుడిలా నిలుస్తున్న తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదినం ఈ నెల 10వ తేదీ సందర్భంగా ప్రత్యేక కథనం.
నమ్మకానికి మారుపేరు.. పొంగులేటి వెన్నంటే…
బంధుత్వంలో మేనల్లుడే అయినా, బాధ్యతలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి నిలువెత్తు అండగా నిలిచారు దయాకర్ రెడ్డి. 2013లో పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుండి కష్టకాలంలో నీడలా, విజయాల్లో తోడుగా ఉంటూ ఒక అచంచలమైన శక్తిగా ఎదిగారు.
2019లో పొంగులేటికి ఎంపీ టికెట్ దక్కకపోయినా, ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రాభవం తగ్గకుండా క్షేత్రస్థాయిలో కేడర్ ను సమన్వయం చేయడంలో దయాకర్ రెడ్డి చూపిన చొరవ అసాధారణం.
ఏ పార్టీలో ఉన్నా పొంగులేటి మాటే శిరోధార్యంగా భావించే దయాకర్ రెడ్డి, నేడు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి గా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతున్నారు.
ఆత్మీయ సమరం.. విజయానికి వారధి…
గత ప్రభుత్వ హయాంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనాలు’ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రను మలుపు తిప్పాయి. పొంగులేటి పిలుపునిచ్చిన ఈ సమ్మేళనాలను విజయవంతం చేయడంలో దయాకర్ రెడ్డి పాత్ర అమోఘం.
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏ చిన్న పల్లెను అడిగినా అక్కడి రాజకీయ సమీకరణాలు ఆయనకు అరచేతిలో వెన్నపూసలా సుస్పష్టం. ఏ మండలంలో ఎవరికి ఎంత పట్టుంది, ఎవరిని ఎప్పుడు చేరదీయాలి అనే విషయాల్లో ఆయన వేసిన పక్కా ప్లానింగ్ వల్లే ఆ సమ్మేళనాలు ప్రభంజనాన్ని సృష్టించాయి.
అధికారుల అడ్డంకులు, రాజకీయ ఒత్తిళ్లను చాకచక్యంగా దాటుకుంటూ ఊరూరా పొంగులేటి వర్గాన్ని ఏకం చేయడంలో దయన్న చూపిన కార్యదక్షత అద్వితీయం.
సమస్య ఏదైనా.. దయన్నే పరిష్కార వేదిక…
సామాన్య కార్యకర్త నుంచి ప్రజల వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు దయాకర్ రెడ్డి.
మంత్రి పొంగులేటి దృష్టికి ఏ విషయాన్ని తీసుకెళ్లాలన్నా ఆయనే ఒక బలమైన వారధి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఓపికగా విని, దాన్ని మంత్రి దగ్గరకు చేర్చి పరిష్కారం అయ్యే వరకు వెన్నంటే ఉండి భరోసా కల్పించడం ఆయన ప్రత్యేకత.
“దయన్నకు చెబితే మంత్రికి చేరినట్టే.. పని జరిగినట్టే” అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. పాలేరు పట్టాభిషేకంలో కీలక పాత్ర పోషించిన ఆయన, నేడు అధికారానికి, సామాన్యుడికి మధ్య ఒక గట్టి వంతెనలా నిలుస్తున్నారు.
అందుకే ఈ నెల 10న దయాకర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, పొంగులేటి అభిమానులు పండుగలా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.




