
ఏన్కూర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 26 2026: వైరా డివిజన్ డీఈ రమేష్ ఆదేశానుసారం, విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏడి యాసిన్ ఆధ్వర్యంలో ఏన్కూర్ ప్రాంత విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం నూతనంగా పెద్ద సామర్థ్యంతో కూడిన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో కేవలం 5 ఎంబీ సామర్థ్యం గల చిన్న ట్రాన్స్ఫార్మర్ మాత్రమే అందుబాటులో ఉండడంతో, పెరుగుతున్న విద్యుత్ వినియోగం దృష్ట్యా తరచూ లో వోల్టేజ్ సమస్యలు, పవర్ ట్రిప్పింగ్ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులు, వ్యవసాయ రైతులు మరియు చిన్న వ్యాపారస్తులు విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యలను గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 8 ఎంబీ సామర్థ్యం గల నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ద్వారా విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా పంపిణీ చేయడమే కాకుండా, పరిసర గ్రామాలైన గృహాలు, వ్యవసాయ పంపుసెట్లు మరియు చిన్న పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటివరకు ఎదురవుతున్న లో వోల్టేజ్ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరిగే సమయంలో కూడా విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఏ ఏడి ఇందిరా, టీఆర్ఏ ఏఈ సిద్ధ రాఘవయ్య, ఏఈ ఉమాకాంత్, ఎల్ఐ రమేష్, ఏఎల్ఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాల మెరుగుదలకు విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు విశేషంగా ఉపయోగపడనున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.




