
దిశలో ‘బోదులబండ’ ధ్వని!
సమస్యలపై గళమెత్తిన సర్పంచ్ నాగార్జున
పారిశుద్ధ్య కార్మికుల కొరతపై జిల్లా అధికారుల దృష్టికి..
రూ. 7.5 కోట్ల రోడ్డు పనులపై ఎంపీ, కలెక్టర్‌కు విన్నపం
తొలి సమావేశంలోనే ప్రత్యేకత చాటుకున్న నూతన సభ్యుడు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : జిల్లా అభివృద్ధి సమీక్షా వేదిక ‘దిశ’ సాక్షిగా ఒక గ్రామ సర్పంచ్ తనదైన ముద్ర వేశారు. నేలకొండపల్లి మండలం బోదులబండ సర్పంచ్, జిల్లా స్థాయి దిశా కమిటీ నూతన సభ్యుడు కట్టెకోల నాగార్జున శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాట పటిమను ప్రదర్శించారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో గ్రామీణ సమస్యలను ఏకరువు పెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు.
పల్లె పారిశుద్ధ్యంపై ‘గళం’ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సవాల్‌గా మారుతోందని, తగినంత మంది కార్మికులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాగార్జున బలంగా వినిపించారు.
పల్లెలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య సిబ్బంది నియామకం తక్షణ అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ, కలెక్టర్.. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు పూర్తి చేయండి! బోదులబండ నుంచి పైనంపల్లి వరకు మంజూరైన రూ. 7.5 కోట్ల రోడ్డు నిర్మాణ పనుల జాప్యంపై ఆయన మాట్లాడారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
సర్పంచ్ విన్నపానికి స్పందించిన జిల్లా యంత్రాంగం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించింది.
పొంగులేటి అభిమానిగా ప్రస్థానం మొదలై… దిశ కమిటీ సభ్యుడి వరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వీరాభిమానిగా, క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ దయాకర్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నాగార్జున.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో 1,505 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు.
అతి తక్కువ కాలంలోనే జిల్లా స్థాయి కమిటీలో స్థానం సంపాదించి, తొలి సమావేశంలోనే తన వాగ్ధాటితో ‘ప్రత్యేకం’ అనిపించుకున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా వేదికపైకి తీసుకెళ్లిన ఆయన తీరుపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.



