
గ్రామపంచాయతీలలో నిధుల గోల్మాల్
Web desc : కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్ కుమ్మక్కై గ్రామపంచాయతీ నిధులను స్వాహా చేశారని వరిగుంతం గ్రామ యువకులు సోమవారం ఆధారాలతో సహా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని వరిగుంతం, రంగంపేట, సంగాయిపేట, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులను ఆయా గ్రామాల కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాలోకి మళ్లించారని ఆరోపించారు.
ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాల పై వరిగుంతంలో గ్రామసభ నిర్వహించగా, గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత కార్యదర్శి ఇద్దరూ నిధుల లెక్కలు గ్రామసభలో చూపించలేకపోయారని తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి నిధులను దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని, గ్రామపంచాయతీ నిధులు కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాలోకి ఎలా జమఅవుతున్నాయో స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా గ్రామ యువకులు ఎంపీడీవో రఫీక్ ఉన్నీసా బేగం, ఎంపీఓ కృష్ణవేణిలను నిలదీశారు.
గత వారం కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు గాని, కంప్యూటర్ ఆపరేటర్ పై గాని చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరిగుంతం గ్రామ భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రశాంత్ తేజ తదితరులు పాల్గొన్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : ఎంపీడీవో రఫీక్ ఉన్నీసా బేగం . మండలంలోని ఐదు గ్రామపంచాయతీల నిధులు కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాలో జమైన విషయం వాస్తవమేనని, ఈ విషయం పై ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియల్సి ఉంది.



