
“భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం.. కలెక్టర్ గారు, ఇది ‘భూభారతి’ పోర్టలా లేక ‘భూభక్షక’ పోర్టలా?
భూదానం పేదల కోసం.. భూకబ్జా దారుల కోసం కాదు! అధికారులారా.. మీ కళ్లు తెరిచే వరకు ఈ పోరాటం ఆగదు!”
— బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ
ఖమ్మం
“భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టం అవుతోందని.. కలెక్టర్ గారు, ఇది ‘భూభారతి’ పోర్టలా లేక ‘భూభక్షక’ పోర్టలా? పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూకబ్జా దారులకు వరంగా మారిందని, అధికారులారా ఇకనైనా, మీ కళ్లు తెరిచే వరకు ఈ పోరాటం ఆగదు”, అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ హెచ్చరించారు.
సోమవారం ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ లో వెలుగుమట్ల భూదాన్ భూముల నిమిత్తం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ, “వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సాగుతున్న భూదాన్ భూముల అక్రమ దందాపై జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు.
పేదవాడి సొంతింటి కల కోసం వినోభాభావే గారు ప్రారంభించిన భూదాన్ ఉద్యమ స్ఫూర్తిని, నేడు ఖమ్మం జిల్లాలో కొందరు అధికారులు, రాజకీయ నాయకులు కలిసి సమాధి చేస్తున్నారు. రికార్డుల సాక్షిగా పచ్చి అబద్ధాలు – ఎవరిని మోసం చేస్తున్నారు?
1963లలో దానంగా వచ్చిన భూమి రికార్డులను పరిశీలిస్తే అధికారుల అసలు రంగు బయటపడుతుంది.
- నాడు (1963): సర్వే నంబర్ 147, 148, 149 లలో 31 ఎకరాల 20 గుంటల భూమిని కుర్రానంద, తులస్య, దేశ్య, షేక్ మజీద్ సాబ్, గలాలు సాబు, అక్బర్ సాబ్, దోమ అచ్చయ్య, రెంటు పల్లి సుబ్బయ్య, పల్నాటి చంద్రయ్య, రెడ్డబోయిన వెంకటేశ్వర్లు వంటి నిరుపేదలకు కేటాయించారు.
- నేడు: ‘భూభారతి డిజిటల్ పోర్టల్‌లో అసలైన లబ్ధిదారుల పేర్లు మాయమైపోయాయి. 148 సర్వే నంబర్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయి?
వ్యవసాయ భూమి ‘నాన్-అగ్రికల్చర్’గా ఎలా మారింది? RDO ప్రొసీడింగ్స్ లేకుండా, భూదాన్ భూములను కమర్షియల్ లేఅవుట్లుగా మార్చడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? 149 సర్వే నంబర్‌లో 14 ఎకరాల భూమిలో ‘రియల్ బెనిఫిషరీస్’ కనపడకుండా పోవడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలెవరివి?
కలెక్టర్ గారు, మీరు చట్టానికి లోబడి పనిచేస్తున్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా?
మీ ముందు మూడు సూటి ప్రశ్నలు ఉంచుతున్నాను:
- వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని ప్రతి సర్వే నంబర్‌లో భూదాన్ భూమి విస్తీర్ణం ఎంతో బహిరంగంగా చెప్పగలరా?
- 1963లో దానంగా వచ్చిన భూమికి, నేటి రికార్డులకు పొంతన ఎందుకు లేదు?
- ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండా భూ బదలాయింపులు చేసిన అధికారులను సస్పెండ్ చేసే దమ్ము మీకుందా?
“వంద గజాల్లో ఇల్లు కట్టుకున్న పేదలను రోడ్డున పడేయడమేనా మీ ప్రతాపం? 31 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.. ఆ భూమిని తిరిగి పేదలకే ఇస్తారా లేక ధనవంతులకు దారాదత్తం చేస్తారా?”
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గత ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పుకోవాలని చూస్తున్నారు.
2023లో BRS ప్రభుత్వం అడ్డుకున్నది ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి అధికారుల అక్రమ చొరబాటును మాత్రమే.
ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు.. మీ ‘షాడో మంత్రుల’ పెత్తనాన్ని సహించేది లేదు. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలి తప్ప, రాజకీయ నేతల కళ్లెదుట మోకరిల్లకూడదు.
వెలుగుమట్ల భూదాన్ భూములపై తక్షణమే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి.
నిబంధనలు ఉల్లంఘించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఇంటికి పంపాలని డిమాండ్ చేస్తూ, పేదల ఇళ్లను ముట్టుకుంటే ఖమ్మం గడ్డపై పెను విప్లవం తప్పదని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో ఖమ్మం రూరల్ మండల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగబోయిన సతీష్, నాయకులు బలుసు మురళి కృష్ణ, మరియు తదితరులు పాల్గొన్నారు.




