
ఏన్కూరులో పోక్సో కేసు నమోదు
మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై సంధ్య
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 04 2026: ఏన్కూరు మండలంలో మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మండల పరిధిలోని గ్రామానికి చెందిన దాసరి వీరభద్రం (63) అనే వ్యక్తి మైనర్ బాలికపై దాడి యత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికకు బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపించి తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఒంటరిగా ఉన్న ప్రదేశంలో బాలికపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి ఈ ఘటనను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించారు.ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి కేసుల నేపథ్యంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సంధ్య కోరారు. చిన్నారులను ఒంటరిగా పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అపరిచితుల మాటలు నమ్మవద్దని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.



