
కార్పొరేషన్లో కలకలం.. బదిలీ అయిన కమిషనర్ ఫైల్స్‌పై సంతకాలు?
Social media viral : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్లకు బదిలీలు జరిగాయి.
బదిలీ అయిన తర్వాత కమిషనర్లు వాళ్లకు కేటాయించిన మున్సిపల్ కేంద్రాలలో బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ జిల్లాలో ఓ కమిషనర్ తాను గతంలో పనిచేసిన కార్యాలయంలో పెత్తనం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నల్లగొండ కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైల్స్ మీద సంతకాలు ప్రస్తుతం కూడా పెడుతున్నట్లు సమాచారం.
నల్గొండ మున్సిపల్ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారోత్సవం రోజు మాజీ కమిషనర్ తన ఇంటి వద్దకు అటెండర్‌తో ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా రెండో దఫా సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజు సంతకం చేసిన తర్వాత అధికారి స్టాంపు వేయాల్సి ఉంటుంది.
కానీ ఒకరోజు ఆ స్టాంపు కార్యాలయంలో ఎక్కడో మిస్ అయిందని ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో ఉన్న అధికారులు సిబ్బంది ఎంతో హడావిడి చేసినట్లు కార్యాలయంలో చర్చ జరిగింది.
అయితే మరోసారి కూడా ఆయనతో సంతకాలు చేయించేందుకు అధికారులు ఫైల్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ ఫైల్స్ పూర్తిగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాబట్టి కొత్త కమిషనర్ తోనే సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడున్న కమిషనర్ అధికారికంగా ఏ ఫైల్ ని కూడా ముట్టుకోవడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న కమిషనర్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం.
తర్వాత కూడా పాత కమిషనర్ ను నల్గొండకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆ కమిషనర్ తను అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్నట్లు సమాచారం.




