
ఉస్మానియా నుంచి రోగి అదృశ్యం…
Web desc : వైద్య చికిత్సల కోసం వచ్చిన ఓ రోగి ఉస్మానియా దవాఖాన నుంచి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా గుండారం, రాంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సల్మాన్(34), రిజ్వానా బేగంలు భార్యాభర్తలు.
కాగా ఈ నెల 7న రాత్రి పది గంటల సమయంలో నివాసంలో సయ్యద్ సల్మాన్‌కు ఫిట్స్ రాగా .. స్థానికంగా సాయి అశ్విని అసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకొచ్చారు.
క్యాజువాల్టీలో పరీక్షించిన వైద్యులు సల్మాన్‌ను ఏఎన్‌ఎస్‌సీ వార్డు యూనిట్-2లో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దవాఖానలోని వార్డు నుంచి సయ్యద్ సల్మాన్ కనిపించకుండా పోయాడు.
దీంతో ఆందోళన చెందిన రిజ్వానా బేగం.. దవాఖాన ఆవరణ, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించక పోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




