
బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
బూర్గంపాడు మండల పరిధిలోని పోలవరం గ్రామ సమీపంలో శనివారం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
అతివేగంగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కొండా దేవా(25) తన వ్యక్తిగత పనుల నిమిత్తం భద్రాచలం వచ్చారు.
పనులు ముగించుకుని తిరిగి తన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, పోలవరం సమీపంలో ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఆయన వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు దేవాకు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకు, చేతులకు బలమైన గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసి స్థానికులు చలించిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే బూర్గంపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం పై దర్యాప్తు చేస్తున్నారు.



