
నాదీ.. నీదీ ఉండదు.. మొత్తం ప్రజలదే
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీరు పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజల అవసరాలను తీర్చేదే ప్రభుత్వం అని, “నాదీ.. నీదీ” అంటూ చిల్లరగా మాట్లాడవద్దని సూచించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రజల సొమ్ముతో నిర్మించబడిందని, అది ప్రజలదేనని స్పష్టం చేశారు.
అక్కసు, అసూయతో పదవి కోల్పోయిన తర్వాత చిల్లర వ్యాఖ్యలు చేసి పరువు తీసుకోవద్దని హెచ్చరించారు. అహంకారం, అబద్ధాలు, వ్యవహార శైలి కారణంగానే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో, శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్మెటలో అత్యాధునిక మలేషియా సాంకేతికతతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రారంభమై, 16 నెలల్లో పూర్తి అయినట్లు తెలిపారు. “ఫామ్ టు హోమ్” కాన్సెప్ట్‌తో రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పామ్ ఆయిల్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాడిగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించబడిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ. లక్ష రుణ మాఫీని నాలుగు విడతల్లో అమలు చేయడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రూ. 25 వేల చొప్పున రుణ మాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి విరుద్ధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, ఇప్పుడు రుణ మాఫీ చేయలేదని విమర్శించడం దుర్మార్గమన్నారు.
గత ప్రభుత్వం తీసుకున్న రూ. 8.5 లక్షల కోట్ల అప్పులకు నెలకు రూ. 7 వేల కోట్ల వడ్డీ, అసలు చెల్లిస్తూనే, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు.
దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, దళిత బంధు అమలు చేయకుండా మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి వడ్డీ రేటును 7.5 శాతానికి తగ్గించిందని తెలిపారు.
అవినీతి కారణంగా రాష్ట్ర నీటి పారుదల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలతో పాటు అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
నర్మెట వేదికగా రైతు భరోసా నిధుల మొదటి విడతగా రూ. 3,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు.
ఎవరు ఏం మాట్లాడినా బెదరకుండా ప్రజల కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బాంబులు పెట్టారని చెప్పడం తగదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి నెలల్లో ఆమోదించిన పనులను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసినట్లు తెలిపారు.
ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.



