
మహిళ ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు
Web desc : కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళను కుకునూరుపల్లి పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పద్ధతి ఆంజనేయులు, సుజాత దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సోమవారం సుజాత ఇంటికి వచ్చి ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే డయల్ 100కు సమాచారం అందడంతో కుకునూరుపల్లి పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు.
ఈ విషయం తెలుసుకున్న కుకునూర్ పల్లి ఎస్ ఎచ్ వో ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకుని జీవితాలను బలి చేసుకోవద్దని హితవు పలికారు.
ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు.



