
జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అవినీతి తిమింగలం..
Web desc : జోగులాంబ జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అవినీతి రూపం మరో స్థాయికి చేరుకుంది. ఒక వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఆయన ప్రమేయం లేకుండానే, వేరొకరి ఫోటోతో రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పైసలు ఇస్తే ఏ పనైనా సాధ్యమని అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన ద్విచక్ర వాహన యజమాని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
తన అడ్రస్‌తో, తన పేరుతోనే కానీ తన ఫోటో లేకుండా వేరొకరి ఫోటోతో రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన ఆరోపించారు. కలెక్టర్ జోక్యంతో ట్రాన్స్పోర్ట్ అధికారులు కదిలి, విచారణ చేపట్టారు.
జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వెంకటేశ్వరావు మాట్లాడుతూ, “విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు నిర్ధారించి, మధ్యవర్తుల ద్వారా పైసలు వసూలు చేస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు.
ట్రాన్స్పోర్ట్ అధికారులపై నిఘా పెట్టాలి.. కొత్త వాహన రిజిస్ట్రేషన్ నుంచి ఇతర సేవల వరకు ఏ పని చేయాలన్నా ఏజెంట్లు లేదా మధ్యవర్తుల ద్వారా డబ్బు ఇవ్వాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
రిజస్ట్రేషన్ కోసం వచ్చే సామాన్యులకు న్యాయం చేయాలని, ట్రాన్స్పోర్ట్ అధికారులపై నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలోని రవాణా శాఖలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి.
ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌కు కూడా అదనపు డబ్బు వసూలు చేస్తున్నట్లు, ఏజెంట్లు మధ్యవర్తులుగా పని చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, అవినీతి మూలాలను పెకలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



