PoliticalSathupallyTelangana

తెల్లవారుజామున 4 గంటల వరకు ఏసీబీ సోదాలు

తెల్లవారుజామున 4 గంటల వరకు ఏసీబీ సోదాలు

తెల్లవారుజామున 4 గంటల వరకు ఏసీబీ సోదాలు

సత్తుపల్లి మున్సిపాలిటీలో మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఏసీబీ సోదాలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగాయి.

ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్సైలు, 15 మంది సిబ్బందితో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగాలకు చెందిన అధికారులను ప్రశ్నించారు.

అనుమానాస్పదంగా భావించిన వ్యక్తుల సెల్‌ఫోన్లు, ఫోన్‌పే, గూగుల్ పే లావాదేవీలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానిత ట్రాన్సాక్షన్లు గుర్తించడంతో కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం పలు కీలక పత్రాలను కూడా అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.

అలాగే మున్సిపల్ ఉద్యోగులు, బిల్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

భవన క్రమబద్ధీకరణలో అవకతవకల ఆరోపణలు

టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ క్రమబద్ధీకరణలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటి పన్ను తగ్గించేందుకు బిల్ కలెక్టర్లు, మేనేజర్‌లు భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు సమాచారం. రూ.6 లక్షల వరకు వచ్చిన పన్నును రూ.75 వేలకే తగ్గించేందుకు సుమారు రూ.2 లక్షల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు.

ఇలా సుమారు 30 నుంచి 50 కేసుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో బిల్ కలెక్టర్, మేనేజర్‌ల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

సోదాలు జరుగుతున్న సమయంలో కొందరు సంబంధిత వ్యక్తులు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, అర్ధరాత్రి వరకు అధికారుల ఎదుట హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మున్సిపల్ ఖర్చులపై కూడా దృష్టి. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఆదాయ-వ్యయాలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.

గత పాలకవర్గం కాలంలో రూ.12 కోట్ల ఆదాయం ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ నికర నిల్వలు రూ.12 లక్షలకే పరిమితమవ్వడం అనుమానాస్పదంగా భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన ఖర్చులను పరిశీలిస్తూ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button