
కవల పిల్లలకు గడ్డి మందు తాగించి బావిలో పడేసిన తండ్రి
Web desc : కరీంనగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా కన్నతండ్రే అమానుషానికి పాల్పడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచుకోవలసిన పిల్లలను దారుణంగా హత్య చేశాడు.
కుటుంబంలో చెలరేగిన కలహాల నేపథ్యంలో తండ్రి తన కవల పిల్లలను చంపి బావిలో పడేసిన అమానుష ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో చోటు చేసుకుంది. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల పసిప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ కు చెందిన గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి తన శుక్రవారం భార్యతో గొడవ పడ్డాడు. చిన్న గొడవ ముదిరి పెద్దగా మారింది
దీంతో విచక్షణ కోల్పోయిన శ్రీశైలం కన్నప్రేమను మరిచిపోయాడు. భార్య మీది కోపాన్ని తన కవలలైన ఇద్దరు కూతుళ్లపై చూపాడు. ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులకు బలవంతంగా గడ్డిమందు తాగించాడు.
అనంతరం వారిని తీసుకెళ్లి సమీపంలో ఉన్న బావిలో పడేశాడు. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపులో ఒక పసిపాప మృతదేహం లభ్యమవ్వగా మరో పాప కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా ఈ అమానుషానికి పాల్పడిన శ్రీశైలంను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ కలహాలతో ఆగ్రహించిన తండ్రి పిల్లలపై ఈ అమానుషానికి ఒడిగట్టినట్టు తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.




