
అంగవైకల్యం అడ్డుకాలేదు
కష్టాల మధ్య వెలిగిన ప్రతిభ
పట్టుదలతో అగ్రస్థానం సాధించిన నిఖిల్
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 15 2026: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన గొడ్ల నిఖిల్ (తండ్రి: నరసింహారావు) తన అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏన్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం హెచ్ఈసీ గ్రూప్‌లో చదువుతున్న నిఖిల్ 500 మార్కులకు గాను 392 మార్కులు సాధించి 78.40 శాతం తో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచాడు.
రెండు కాళ్లు పనిచేయని శారీరక సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి నిరుత్సాహానికి లోనుకాకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టిన నిఖిల్ ప్రతిరోజూ తన తండ్రి సహకారంతో బాలపేట గ్రామం నుండి ఏన్కూర్ వరకు కళాశాలకు హాజరవుతూ చదువులో నిబద్ధతను చాటుకున్నాడు. వర్షం, ఎండ వంటి పరిస్థితులు అడ్డొచ్చినా చదువు విషయంలో ఎప్పుడూ రాజీ పడకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాడు.
పాఠశాల నుండి ఇంటికి వచ్చాక కూడా గంటల కొద్దీ చదువుకు సమయం కేటాయిస్తూ, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నాడు.
ఈ క్రమంలో వచ్చిన ఫలితమే అతని ఈ అద్భుత విజయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నిఖిల్ సాధించిన ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించింది.
అతని పట్టుదల, కృషి ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది. నిఖిల్‌ను కళాశాల అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అతను తన చదువును కొనసాగించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.




