
సబ్ రిజిష్టర్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఈ తనిఖీల్లో ఎస్ఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు, డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై సైతం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
షాపులను మూసివేసిన డాక్యుమెంట్ రైటర్లు… విజిలెన్స్ అధికారుల తనిఖీల నేపథ్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను మూసివేసి వెళ్లిపోయారు.
గతంలో ఏసీబీ అధికారుల దాడులు, ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల సోదాల నేపథ్యంలో బిబి నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందా అనే చర్చ అందరిలో రేకెత్తిస్తోంది.




