
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Web desc : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బిలాల్ పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) కె. శ్వేతను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి తోడు ఫేక్ అటెండెన్స్, విధులకు గైర్హాజరుతో పాటు రూ.49 వేల ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసుకున్నారన్న అవినీతి ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆమె కోహిర్ మండలం పీచరాగడి ( ఏ )తాండా గ్రామపంచాయతీలో డెప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామ సర్పంచ్ చేసిన ఫిర్యాదు మేరకు జహీరాబాద్ డీఎల్పీఓ, కోహిర్ ఎంపీడీవో లకు విచారణ చేపట్టగా.. విధులకు సకాలంలో హాజరు కాకపోవడం, గ్రామ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు.
అదేవిధంగా బిలాల్ పూర్ గ్రామపంచాయతీలో పని చేసిన సమయంలో ఈ-గ్రామ్ స్వరాజ్ నిధుల నుంచి రూ.49,030ను పీఎఫ్ఎంఎస్ ద్వారా ఆమె వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే హౌస్ ట్యాక్స్‌ను అందరి నుంచి కాకుండా కొద్దిమంది నుంచే వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసి ఆమెను సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.




