
అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే సందడి
చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు ప్రశంసలు
విద్య, పోషణపై ప్రత్యేక కార్యక్రమాలు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 23 2026: ఏన్కూరు మండలంలోని తూత్క లింగన్నపేట, శ్రీరామగిరి, తిమ్మారావుపేట, నూకలంపాడు గ్రామాలలో పోషణ పక్వాడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యపై గ్రామస్థులకు విస్తృత అవగాహన కల్పించారు.
తూత్క లింగన్నపేటలోని 1, 2, 4 అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ-స్కూల్ పిల్లలు ప్రతిరోజు నేర్చుకునే పాఠ్యాంశాలను—క్లాస్ కార్డులు, కథల పుస్తకాలు, ఆటలు, పాటలు—తల్లిదండ్రుల ముందుకు ప్రదర్శించారు. పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గుగులోతు ప్రవీణ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలు మేధోశక్తి పెంపొందించుకుంటారని పేర్కొని వారిని అభినందించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ బక్కమ్మ, అంగన్వాడీ టీచర్లు పావని, సింధు, ఆంధ్రవాణి, ఆయా లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇక శ్రీరామగిరి, తిమ్మారావుపేట గ్రామపంచాయతీలలో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పాల్గొని గర్భిణీ సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, SAM, MAM వంటి పోషక లోపాలపై అవగాహన కల్పించడంతో పాటు ‘బాలామృతం ప్లస్’ వినియోగంపై సమాచారం అందించారు. ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, ECCE డే ప్రాముఖ్యత, పేరెంట్స్ కమిటీ సమావేశాల గురించి కూడా వివరించారు.
నూకలంపాడు గ్రామంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమానికి సర్పంచ్ ఇంజం శేషగిరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానికంగా లభించే చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను పిల్లలకు ప్రతిరోజూ అందిస్తే ఆరోగ్యంగా ఎదుగుతారని, చదువుల్లో చురుకుదనం పెరుగుతుందని తెలిపారు. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.
ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల హెడ్‌మాస్టర్లు, వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో పోషణ, ఆరోగ్యం, విద్యపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని నిర్వాహకులు తెలిపారు.




