
కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది.. కేఏ పాల్ సంచలన ఆరోపణలు
Social media viral : కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అమెరికా పర్యటన బిజీ కారణంగా ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని పేర్కొన్నారు. తండ్రి కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగానే కవిత కొత్త పార్టీని స్థాపించారని పాల్ తెలిపారు. గతంలో కవిత ముఖ్యమంత్రి పదవి అడిగితే కేసీఆర్ నిరాకరించారని ఆయన వెల్లడించారు.
2008లోనే కవిత తన వద్దకు వచ్చి పార్టీ నిధుల కోసం రూ.10 కోట్లు అడిగారని గుర్తు చేశారు. అప్పట్లో తాను రూ. 15 కోట్లు ఇద్దామనుకున్నానని, కానీ కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని కేసీఆర్ కోరడంతో వెనక్కి తగ్గానని కామెంట్ చేశారు.
కవిత పార్టీ వల్ల ఎవరికీ మేలు జరగదని, కేవలం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆమె ఆరాటపడుతున్నారని విమర్శించారు. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు తాను డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానని కేఏ పాల్ తెలిపారు.
ఈ యుద్ధం ఆగకపోతే ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల ప్రతినిధులు తన సలహాలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
తానూ అప్పులు తీసుకురాగలనని, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా మేధావులు, సామాన్యులు అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.




