
1/70 చట్టం ఎవరి కోసం ..?
తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గా విడిపోయిన ఆదివాసి ప్రజల చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు అక్కడ, ఇక్కడ ఒకే విధంగా చూడాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా 1950 నుండి ఆదివాసులకు హక్కులు అమలవుతున్న నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీ భూమి పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. జల్, జంగల్, జమీన్ నినాదం ఆదివాసీ ప్రాంతాలలో అగ్నిజ్వాల రగులుతూనే ఉంది. ప్రభుత్వ పాలనకు ముందు బ్రిటీష్, నిజాం నవాబులు, అంతకుముందు కాకతీయులు అలాగే మౌర్య చక్రవర్తుల పాలనలో సైతం ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో వారి నుండి తిరుగుబాటు పోరాటాలు జరిగాయనడానికి చారిత్రక సాక్ష్యాలు లేకపోలేదు స్వయం పాలన కోసం కాకతీయులతో పోరాడి అసువులు బాసిన సమ్మక్క సారలమ్మ నుండి నిజాం సేనలతో పోరు చేసిన రాంజీ గోండ్, కొమరం భీం వరకు అలాగే మహారాష్ట్ర, చందా, బస్తర్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో సిద్కాకి బాబురావు, వీర్ నారాయణ సింగ్, బిర్సా ముండా, మాణిక్ ఫర్డ్, బల్లార్షా వంటి యుగపురుషుల తిరుగుబాటు తమ మనుగడ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం చివరి శ్వాస వరకు పోరాడి ఉరి తీయబడటం కాల్చివేతకు గురికావడం అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో భద్రాచలం నుండి రంపచోడవరం ఏలూరు దాకా జరిగిన పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం రాజు, మైసూర్ మహారాజు సైనిక దళాల సహాయం తీసుకోవడం జరిగింది అంటే ఆదివాసి పోరాటాలపై ఆనాటి సామంత రాజుల యొక్క నియంత్రణ, అణచివేతలు ఆనాటి నుంచి ఆదివాసులపై కొనసాగుతూనే ఉన్నాయి.
భూమి, నీరు, అటవీ మాదే అంటూ జరిగిన అనేక ఆదివాసీల పోరాటాలపై అధ్యయనం చేసిన నాటి ప్రభుత్వాలు, బ్రిటీష్ ప్రభుత్వాలు అలాగే నేటి ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చాయి. 1917లో బ్రిటీష్ వాళ్ళు అప్పటి మద్రాసు రాష్ట్రంలోని ప్రస్తుత ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో భూమి బదలాయింపు, వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు 1917 చట్టం చేసారు. ఏజెన్సీ ప్రాంతాలలో కలెక్టర్ (ఏజెంట్) అనుమతి లేకుండా గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరగడానికి వీలులేదన్నది ఈ చట్టం సారాంశం. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1917 చట్టాన్ని సవరించి 1959 (ఎ.పి.ఎస్.ఎ.ఎల్.టి.ఆర్. చట్టం) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ప్రాంతాల భూమి బదలాయింపు నియంత్రణ చట్టాన్ని చేశారు. ఇందులో గిరిజనుల నుండి గిరిజనే తరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి బదలాయింపు జరగడానికి వీల్లేదని, జిల్లా కలెక్టర్ అనుమతి సైతం లేదన్నది స్పష్టం. 1963 నుండి ఈ చట్టాన్ని తెలంగాణ జిల్లాలలోని షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపజే శారు. దీనితో ఆదివాసిల భూములు ఆక్రమణలు అన్యాక్రాంతంకు గురికాకుండా రక్షించబడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియాలో వలస గిరిజనేతరులు బినామీల పేర్లతో ఆదివాసుల భూములను చట్ట విరుద్ధంగా విక్రయిస్తూ… ఆదివాసుల హక్కులకే భంగం కలిగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులు సృష్టిస్తున్న ఆకృత్యాలపై ప్రభుత్వం, పాలకులు, ఆదివాసి ప్రజాప్రతినిధులు పట్టించుకునే నాధుడే కరువైయుండని ఆదివాసీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
నాడు చోటుచేసుకున్న వాస్తవ పరిస్థితులు అంటే 1960 దశకంలో నక్సల్స్ నేతృత్వంలో జరిగిన పీడిత ప్రజల శ్రీకాకుళ గిరిజన తిరుగుబాటు వంటి పోరాటాల దాకా రాష్ట్రంలో గిరిజనుల యోగక్షేమాలు కనుక్కున్న వాళ్లు అతితక్కువలో తక్కువే. ఆ తర్వాత మాత్రం ఆదివాసుల మంచి చెడుల గురించి చర్చించడం, కొత్త చట్టాలు, కొత్త సంస్థలు వచ్చాయి. అందులో ఒకటి రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970, ఇది 1959 నాటి చట్టాన్ని సవరించి రెండు బలమైన మార్పులను ప్రవేశపెట్టింది.
1). ఇక మీదట షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల నుండి గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులే కాదు, గిరిజనేతరుల నుండి గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులు కూడా చెల్లవు.
2). షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి కలిగి ఉన్న గిరిజనేతరులు ఆ భూమిని తాము అక్రమంగా సంపాదించుకోలేదని తామే రుజువు చేసుకోవాలి. అంతవరకు అది గిరిజనుల భూమిగా భావించబడుతుంది. అంటే రుజువు చేసుకునే బాధ్యత (బర్డెన్ ఆఫ్ ప్రూఫ్) గిరిజనేతరుల మీదనే ఉన్నదనేది తేటతెల్లం. దీని ఫలితంగా గిరిజనుల నుండి ఫిర్యాదు లేకుండానే సంబంధిత ప్రభుత్వ అధికారి షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి ఉన్న గిరిజనేతరులందరికీ నోటీస్ జారీ చేయవచ్చును. నీ భూమి అక్రమంగా సంపాదించుకున్నది కాదని నిరూపించుకోమ్మని అడగవచ్చును. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని గిరిజనులకు ఇవ్వవచ్చునన్నది స్పష్టం. 1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
షెడ్యూల్డ్ ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులకు బదలాయించడం చెల్లదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 1/70 భూ నిబంధనల కింద గిరిజనేతరునిగానే భావించాలని 1997లో సమతా మరియు మైనింగ్ కంపెనీకి మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమి నుండి వారిని తొలగించడం లేదా వారి అటవీ భూమి హక్కుల్లో జోక్యం చేసుకోవడం, గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి జీవనోపాధి అయిన వ్యవసాయం చేసుకునే భూమిని సొంతం చేసుకోవడం కూడా అత్యాచారమే అని కొత్తగా రూపొందించిన సవరణ చట్టం 2015 తెలియజేస్తుంది. ఆదివాసుల కోసం ఎంతో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందరో ఆదివాసి పోరాట యోధులు, బుద్ధి జీవులు నేతృత్వంలో 1960 దశకంలో నాడు ఏ అమాయకపు ఆదివాసీల కోసమైతే పోరాటాలు జరిగాయో ఆదివాసీల ప్రజల రక్షణ కోసం ఎల్ టి ఆర్ చట్టం, 1/70 యాక్ట్, పేసా గ్రామ సభ, వడ్డీ వ్యాపారాలని నిషేధిత చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాలను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాలలో అంగ బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం పెంచుకొని ఆదివాసుల హక్కులను, చట్టాలను లెక్కచేయకుండా ఆదివాసుల భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని వారే నిజమైన హక్కుదారులుగా రాజ్యమేలుతున్నారు. ఆదివాసీ ప్రాంతాలలో హక్కులు అడ్డొస్తున్నాయన్న పేరుతో గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతా భూములు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేందుకు 1998 లో జీవో నెంబర్ 275 ను వలస గిరిజనేతరులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి రద్దు చేయించారు. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ సిఫారసులు మేరకు 275 జీవో స్థానంలో జీవో నెంబర్ 3 ను జనవరి 2000 సంవత్సరం నా జారీ చేయడం జరిగినది. వలస వాదుల కుట్రలు, కుయుక్తులతో జీవో 3ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు 22 ఏప్రిల్ 2020 రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని చదువుకున్న ఆదివాసి యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు.దానిని కొనసాగింపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు కాదు అంటూ మైదాన ప్రాంతానికి సమీపంలో ఉన్న సుమారు ఆరు గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. ఇంతటితో ఆగకుండా షెడ్యూల్ ఏరియా హక్కులతో భంగం వాటిల్లుతుందని గిరిజనేతరులకు మూకుమ్మడిగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి 1/70 చట్టం సవరించి భూములపై మాకు హక్కులు కల్పించాలని 1684 మంది గిరిజనేతరులు పిటిషన్ దాఖలు చేశారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో 140 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు గిరిజనేతరులు ప్రయత్నించగా స్థానిక ఆదివాసులు తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 144 సెక్షన్ విధించి పోలీసులు అక్కడ పరిస్థితులను చక్కబెట్టారు.ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలలో సుమారు 20వేల ఎకరాల పట్టా భూములు గిరిజనేతరుల చేతిలో పరాయికరణకు గురైనట్లు అధికారికంగానే లెక్కలు ఉన్నాయి. ఇక పోడు భూముల విషయానికి వస్తే పట్టా భూములు వలసవాదులు ఆక్రమించుకున్నారని జీవన ఉపాధి కోసం పోడుభూమి సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారుల ఆగడాలతో ఆదివాసీ ప్రజల జీవనం అందాకారమవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా చలామణి అవుతున్న గిరిజనేతరుల చేతుల్లోనే వందల ఎకరాల పోడు భూములను ఆక్రమించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆదివాసులు పోడు సాగు భూములకు హక్కు పత్రాలు కావాలని దరఖాస్తు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 12 వేల మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తెలంగాణలో పోడు సాగు పోరు రగడ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. నేడు ఆదివాసుల దుస్థితి ఊర్లో ఉన్నయ్యారు… అడివిలో బతకనీయరు అన్న చందంగా మారింది. ఆదివాసుల అభివృద్ధి కోసం ఎన్ని చట్టాలు ఉన్నా అవి అమలకు నోచుకోనంత కాలం ఆదివాసీ ప్రజలు అన్యాయాలకు, అక్రమాలకు, వలస గిరిజనేతరుల కుట్రలకు బలవుతూనే ఉంటారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతున్న దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ 5వ షెడ్యూల్ భూభాగం ఏజెన్సీ ప్రాంత పరిధిలోని విధులు నిర్వహిస్తున్న అధికారులు ఆదివాసీ ప్రజల భూ సమస్యలను జాతి సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఆదివాసి ప్రజల అస్తిత్వానికే ప్రమాదం పొంచి ఉంది.
-డాక్టర్ సాగబోయిన పాపారావు
ఆదివాసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్
సెల్ నంబర్ :9441288991




