
రోడ్డుపైనే వ్యాపార బోర్డులు
ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ఏన్కూరు ప్రధాన కూడలి
అధికారుల నిర్లక్ష్యమా..? వ్యాపారుల ఇష్టారాజ్యమా..? ప్రజల ప్రాణాలతో చెలగాటం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 26 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రస్తుతం వ్యాపార ప్రకటన బోర్డుల ఆక్రమణతో ప్రమాదకరంగా మారింది. రహదారికి ఇరువైపులా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థల బోర్డులు, ఫ్లెక్సీలు, స్టాండ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కూడలిలో బోర్డుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా రోజురోజుకు పెరుగుతోంది.
ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన భారీ బోర్డులు వాహనదారుల దృష్టిని మరల్చడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడంలో ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కూడలి ప్రాంతాల్లో రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా రహదారి అంచుల వరకు బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒకవేళ వేగంగా వస్తున్న వాహనాలు అదుపుతప్పితే అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇప్పటికే రహదారిపై బోర్డుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ విషయమై సీకే న్యూస్ ప్రతినిధి ఏన్కూరు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌ను వివరణ కోరగా, రహదారులపై ఏర్పాటు చేసిన ఈ వ్యాపార బోర్డులకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యాపారులు స్వేచ్ఛగా, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైనే బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రజల భద్రత కంటే వ్యాపార ప్రకటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగాక స్పందించే కంటే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి ఆక్రమణకు కారణమవుతున్న బోర్డులను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చూడాలని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే వరకు అధికారులు మేల్కొరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీ యంత్రాంగం సమన్వయంతో స్పందించి రహదారులను ఆక్రమించిన బోర్డులను తొలగించి, ప్రధాన కూడలిలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.




