
జాగింగ్ చేస్తుండగా వాహనం ఢీకొని.. హెడ్‌కానిస్టేబుల్ మృతి
ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్నారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనం వరప్రసాద్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన ఆయన తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు.




