HyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో సొంతిల్లు ఛాన్స్.. 10 వేలు కడితే..!

హైదరాబాద్‌లో సొంతిల్లు ఛాన్స్.. 10 వేలు కడితే..!

హైదరాబాద్‌లో సొంతిల్లు ఛాన్స్.. 10 వేలు కడితే..!

హైదరాబాద్ పరిధిలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలోనే ఉత్సవాలు జరుపుకునేలా నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి సచివాలయంలో ఈ పథకానికి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

తొలి విడతగా 8,000 ఇళ్ల నిర్మాణం.. ఈ పథకంలో భాగంగా మొదటగా 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించనున్నారు. ప్రతీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 గృహాలను నిర్మించనున్నారు. త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను సేకరించి పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు. ఈ ఇళ్ల కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 21 నుంచి ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది.

అర్హులైన వారు మీసేవ సెంటర్లు లేదా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజును రూ.10,000 గా నిర్ణయించారు. అయితే ఏ నియోజకవర్గంలో నివసించేవారు ఆ పరిధిలోనే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వివరాలు

పేదలు నివసించే ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల వైశాల్యంతో 1BHK ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఒక్కో ఫ్లాట్ తయారీకి రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం ఉచిత సబ్సిడీగా ఇస్తుంది. మిగిలిన రూ.6 లక్షల లబ్ధిదారుడి వాటాను నాలుగు విడతల్లో చెల్లించే సదుపాయం కల్పించారు.

దీనికి తోడు రూ.40 నుంచి రూ.60 లక్షల విలువ చేసే స్థలాన్ని ఇంటి మహిళ పేరు మీద ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. అయితే ఈ ఆస్తిని 10 సంవత్సరాల పాటు విక్రయించడానికి అనుమతి ఉండదు, కానీ అవసరమైతే బ్యాంక్ రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.

అర్హతలు , పారదర్శక ఎంపిక విధానం.. ఈ పథకానికి అర్హత పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. అలాగే క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు కానీ, ప్లాట్ కానీ ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు.

ఒకవేళ దరఖాస్తుదారులు ఎక్కువగా ఉంటే బహిరంగ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లాటరీలో ఇల్లు మంజూరు కాకపోతే, వారు చెల్లించిన రూ.10,000 దరఖాస్తు రుసుమును తిరిగి ఇచ్చేస్తారు. అలాగే పేదలతో పాటు త్వరలోనే మధ్యతరగతి ప్రజలకు కూడా గృహనిర్మాణానికి సంబంధించి మంచి వార్త చెప్తామని మంత్రి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button