
యువతి ఆత్మహత్య.. వ్యక్తి వేధింపులే కారణమా..?
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్గండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త ప్లాట్లలో నివాసముంటున్న కోస్గి శృతి (16) అనే యువతి సోమవారం విషాదకర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెత్తు చీకులకు చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. గతంలో అదే గ్రామానికి చెందిన కోస్గి సత్యయ్య శృతిని తన వెంట తీసుకెళ్లిన ఘటనపై పోలీస్ కేసు నమోదై, అతను జైలుకు వెళ్లాడు.
రెండు నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన సత్యయ్య మృతురాలి కుటుంబ సభ్యులను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారు జోక్యం చేసుకుని సత్యయ్యను మందలించి ఇకపై వారి జోలికి వెళ్లవద్దని హెచ్చరించినట్లు తెలిసింది.
అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ విధంగా ఉరి వేసుకుని శృతి ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో తీవ్ర కలకలాన్ని రేపింది. మృతురాలు శృతి తండ్రి గతంలోనే మరణించగా, తల్లి లక్ష్మమ్మతో పాటు ఇద్దరు సోదరులు ఉన్నారు.
సోమవారం తల్లి, సోదరులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నది. కూతురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వాకిటి నరేందర్ తెలిపారు. యువతి ఆత్మహత్య వెనుక వేధింపులే కారణమా? లేక మరే ఇతర అంశాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.




