
ఆకాశమా… మా మొర వినవా?
వాన కోసం వేడుకుంటున్న రైతన్న
ఆకాశం వైపే రైతన్న ఆశలు
కురవని వానలు.. ఎండిపోతున్న పొలాలు.. పంటల భవితపై పెరుగుతున్న ఆందోళన
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 22 2026: ఆకాశమంతా మేఘాలు కనిపిస్తున్నా చినుకు కూడా కురవకపోవడంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పొలంలో ఒంటరిగా కూర్చుని ఆకాశం వైపు చేతులు జోడించి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతు దృశ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
వర్షాల కోసం భూమిని సిద్ధం చేసి, విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు వాన కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల విత్తిన పంటలు తగిన తేమ లేక మొలక దశలోనే ఎండిపోతుండగా, మరికొందరు రైతులు వర్షాలు పడే వరకు విత్తనాలు వేయకుండా నిరీక్షిస్తున్నారు.
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వర్షాలు లేక బోర్లు, చెరువులు, వాగుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో సాగునీటి సమస్య కూడా మరింత తీవ్రమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రైతుల ఆశలన్నీ ఆకాశంపైనే ఉన్నాయి. ఎల్నినో ప్రభావం తగ్గి, రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసి పంటలను కాపాడాలని రైతులు ఎదురుచూస్తున్నారు.




